న్యూఢిల్లీ, జూలై 30: ఏమిటీ.. ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడుతున్నారు.. విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ అనుమానం నిజమే.. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు కూడా ఆ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే అని ఐరాస వెల్లడించింది. 2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు, ఇది ప్రపంచ వలసదారుల్లో 6 శాతం అని తెలిపింది.
ఒకప్పుడు సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలకే పరిమితమైన భారతీయ వలస సముదాయం ఇప్పుడు పశ్చిమ దేశాలకు బదిలీ అయ్యింది. పశ్చిమాసియాలోని ఇండియన్ డయాస్పొరాను తీసుకుంటే యూఏఈలోని మొత్తం జనాభాలో 40 శాతం (ఇంచుమించు మూడో వంతు) భారతీయ వలసదారులే ఉన్నారు. ఇక అమెరికాలో ఇండో అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ గ్రూప్‌గా ఉన్నారు. మొదటి స్థానంలో చైనీస్ అమెరికన్లు ఉన్నారు.