ఉలాన్బాతర్: మంగోలియా ప్రధాని ఓయున్ ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటులో విశ్వాస ఓటుపై మద్దతు కూడగట్టడంలో ఎర్డెన్ విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగగా ఆయనకు 44 మంది చట్టసభ సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు. విశ్వాస తీర్మానం వీగిపోవడానికి 64 ఓట్లు అవసరం కాగా ఎర్డెన్ మరో 20 ఓట్ల దూరంలో నిలిచిపోయారు. 30 రోజుల్లోగా కొత్త ప్రధానిని పార్లమెంట్ ఎన్నుకోంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఎర్డెన్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు.
ప్రధాని ఎర్డోన్ కుమారుడు విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన అవినీతికి పాల్పడినట్లు నివేదికలు వెలువడంతో గత కొన్ని వారాలుగా దేశ రాజధాని ఉలాన్‌బాతర్‌లో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో రహస్య ఓటింగ్ నిర్వహించారు. ఇందలో ఓడిపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి, యుద్ధాలు సహా కష్ట కాలంలో దేశానికి, ప్రజలకు సేవ చేయడం గౌరవంగా ఉందని చెప్పారు.