వాషింగ్టన్: మీకు హారర్ సినిమాలు చూడడమంటే ఇష్టమా? అయితే మీ పంట పండినట్టే. ఓ 13 సినిమాలు అలా అలవోకగా చూసేయండి. అక్షరాలా రూ.95 వేలు మీ ఖాతాలోకి వచ్చిపడతాయి. ఫైనాన్స్ బజ్ అనే కంపెనీ వచ్చేనెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇప్పటిదాకా వచ్చినవాటిలో 13 అత్యంత భయానకమైన చిత్రాలను చూపిస్తారు. వాటిని చూసేవారు ఫిట్‌బిట్ మెషిన్ సాయంతో తమ గుండె వేగాన్ని నమోదు చేసి దానికి తమ అభిప్రాయాలను జత చేసి పంపాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని హారర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్ అని పిలుస్తారు. ఒక మూవీ బడ్జెట్‌కు, అది వీక్షకులపై వేసే ప్రభావానికి సంబంధం ఉందా అని తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీఎన్ఎన్ తెలిపింది. అనాబెల్, ఎ క్వయట్ ప్లేస్ తదితర 13 సినిమాల జాబితా కంపెనీయే ఇస్తుంది. వాటిని చూసేందుకు ఓటీటీలకు అయ్యే ఖర్చును కూడా ఇస్తుంది. ఇందులో మెలిక ఏమిటంటే అభ్యర్థులు కనీసం 18 ఏండ్లు నిండిన అమెరికావాసులు అయ్యుండాలి.