టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) స్పృహలో లేనట్లు తెలిసింది. తీవ్రమైన వైద్య సమస్యతో ఆయన ఇబ్బందిపడుతున్నాడు. ఇరాన్‌లోని కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ కథనంలో పేర్కొన్నారు. దేశాన్ని ఆయన పాలించలేకపోతున్నట్లు ఆ రిపోర్టులో చెప్పారు. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం మొజ్తాబాకు రహస్య ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. కోమ్ నగరంలో మొజ్తాబాకు చికిత్స అందిస్తున్న విషయాన్ని తొలిసారి ఇరాన్ బహిరంగంగా అంగీకరించింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న మొజ్తాబా .. ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోవడం లేదని ఆ రిపోర్టులో చెప్పారు.
మొజ్తాబా ఆరోగ్య పరిస్థితిపై అమెరికా-ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌తో పాటు గల్ఫ్ దేశాల ప్రతినిధులకు కూడా సమాచారాన్ని చేరవేశారు. ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన దాడిలో మొజ్తాబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలోనే మొజ్తాబా కూడా గాయపడ్డారు. కానీ చాన్నాళ్ల నుంచి అతని లొకేషన్ బహిర్గతం కాలేదు. అతను కోమ్ పట్టణంలో ఉన్నట్లు మొదటిసారి సంకేతాలు అందాయి. మొజ్తాబా ఖమేనీ తండ్రి , సుప్రీంనేత అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలు కూడా కోమ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.