Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన సన్నిహితుడు అయతొల్లా మోసెన్ ఖోమి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మొజ్తాబా ఆరోగ్యం గురించి కీలక విషయాలు వెల్లడించారు. మొజ్తాబా అనారోగ్యంగా ఉన్నారంటూ అమెరికా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, మొజ్తాబా ఆరోగ్యంపై వస్తున్న వదంతులు తప్పని అన్నారు. అయతొల్లా సయ్యిద్ మొజ్తాబా ఖమేని పూర్తి ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు ఖోమి తెలిపారు.
‘‘మొజ్తాబా ఆరోగ్యం గురించి చాలా మంది అడుగుతుంటారు. అతడు ఎందుకు కనబడడు..? ఒక ఆడియో లేదా వీడియో సందేశం ఎందుకు పంపించడు..? ఇతరులు ఎవరూ ఆయనను ఎందుకు కలవరు.. కలిసి మాట్లాడారు..? ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఇదంతా శత్రువుల ఉపాయం. దీని ద్వారా మేం ఆయన గురించి మాట్లాడి, వెల్లడిస్తే.. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మా అందరి లక్ష్యం ఆయనను రక్షించుకోవడమే. దేవుడు ఉన్నాడు అనేందుకు మొజ్తాబాయే సాక్ష్యం. గాయపడ్డప్పటికీ ఆయన కోలుకున్నారు. షియాలకు ప్రతినిధిగా దేవుడు ఆయనను రక్షించాడు. మొజ్తాబా ఉన్న బిల్డింగ్‌పైనే బాంబు దాడి జరిగింది.
ఈ ఘటనలో అక్కడి వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఈ బాంబు పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఆయన ఆ బిల్డింగ్ నుంచి కోర్డ్ యార్డుకు చేరుకున్నారు. దేవుడు ఆయనను రక్షించాలని భావించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉండి, అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అమెరికాతో చర్చలు, సైనిక నిర్వహణ వంటి అంశాల్ని సమీక్షితున్నారు” అంటూ ఖోమి చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన దాడి ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని సహా పలువురు కుటుంబ సభ్యులు మరణించారు.
అయితే, ఈ ఘటనలో మొజ్తాబా ఖమేని మాత్రం తప్పించుకుని బయటపడ్డట్లు ప్రచారం జరిగింది. ఆయన గాయపడ్డారని, రహస్యంగా చికిత్స పొందుతున్నారని ట్రంప్ చెప్పారు. తాజాగా, ఆయన సన్నిహితుడు ఈ అంశంలో ఒక ప్రకటన చేశారు.