Emmy Award : మయన్మార్ అంతర్యుద్ధంపై డాక్యుమెంటరీకిగానూ మిజోరాం రాష్ట్రానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు అవార్డుకు ఎంపికయ్యారు. బీబీసీ టీమ్‌తో కలిసి అక్కడి పరిస్థితుల్ని చిత్రీకరించిన హెచ్‌సీ వన్లరౌటా, ఎజాక్ జొరామ్సంగాలు ప్రతిష్టాత్మక ‘ఎమ్మీ అవార్డు’ (Emmy Award) అందుకున్నారు. ఈశాన్య రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తులుగా గుర్తింపు సాధించారిద్దరు. దాంతో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లద్దుహొమ ఈ జర్నలిస్టులను అభినందించారు.
శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వన్లరౌటా, ఎజాక్లను సన్మానించిన ఆయన.. ఇది చరిత్రాత్మకమైన రోజు. రిపోర్టింగ్‌లో వీళ్లిద్దరు కనబరిచిన అంకితభావం, ధైర్యసాహసాలును ఎంతగానో ప్రశంసిస్తున్నా అని లద్దుహొమ తెలిపారు.
మయన్మార్‌లో అంగ్‌సాన్ సూచీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో సైన్యం కూలదోసింది. అప్పట్నుంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టగా.. రాజకీయ కల్లోలం మొదలైంది. అల్ప సంఖ్యాకులు ఎక్కువగా ఉండే సరిహద్దు గ్రామాల్లో నిత్యం హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అంతర్యుద్ధంలో అట్టుడుకుతున్న మయన్మార్‌పై బీబీసీ సంస్థ డాక్యుమెంటరీ తీయాలనుకుంది. మిజోరం జర్నలిస్టులు వన్లరౌటా, ఇజాక్ మరో ముగ్గురితో కూడిన బీబీసీ బృందం 2024లో చిన్ స్టేట్‌కు వెళ్లింది.
అక్కడ ఎనిమిది రోజులు ఉండి.. అక్కడి హింసాత్మక ఘటనలు.. యుద్ధంతో చిధ్రమైన ప్రజల జీవితాలను మయన్మార్ సివిల్ వార్ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించారు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపడంలో మిజోరం జర్నలిస్టుల కృషి ఎనలేనిదని ఎమ్మీ అవార్డు కమిటీ తెలిపింది.