MIT | న్యూయార్క్, నవంబర్ 21: ఇంజెక్షన్ల అవసరం లేకుండా నేరుగా జీర్ణకోశంలోని అవయవాల్లోకి ఔషధాన్ని పంపించేందుకు సరికొత్త కాప్సూల్స్(గుళిక)ను పరిశోధకులు తయారుచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), డెన్మార్క్‌కు చెందిన నోవో నార్డిస్క్ అనే ఫార్మసీ సంస్థకు చెందిన పరిశోధకులు రెండు రకాలు కాప్సూల్స్‌ను అభివృద్ధి చేశారు. ఒకటి 80 మైక్రోలీటర్లు, మరొకటి 200 మైక్రోలీటర్ల ఔషధాన్ని జీర్ణకోశంలోకి తీసుకెళ్లగలవు.
సాధారణంగా ఇన్సులిన్, ఆర్ఎన్ఏ ఆధారిత ఔషధాలను మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకుంటే జీర్ణకోశంలోకి వెళ్లేసరికి అవి క్షీణించిపోతాయి. అందుకే వీటిని ఇంజెక్షన్ల ద్వారా అందిస్తారు. ఈ ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా జెట్ ప్రొపల్షన్ పద్ధతితో ఈ కొత్త కాప్సూల్స్‌ను తయారుచేశారు. ఈ కాప్సూల్స్ జీర్ణకోశంలోకి వెళ్లిన తర్వాతనే ఔషధాన్ని విడుదల చేస్తాయి. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఇన్సులిన్‌తో పాటు పలు ఔషధాలను సమర్థంగా జీర్ణకోశంలోకి విడుదల చేసినట్టు తేలింది.