Harvard University | వాషింగ్టన్, డిసెంబర్ 31: రోజులో మరీ ఎక్కువ సమయం కూర్చొనే జీవన శైలి కలిగి ఉండటం ఆరోగ్యానికి హానికరమని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీలు చేసిన తాజా అధ్యయనం హెచ్చరించింది. ఒక రోజులో పదిన్నర గంటల కంటే ఎక్కువ సేపు కూర్చొంటే మరణానికి దారి తీసే గుండె వైఫల్యం తదితర హృద్రోగాలు పెరిగే ప్రమాదముందని తెలిపింది. అధ్యయనంలో భాగంగా సగటున 62 ఏండ్ల వయసున్న 89,530 మంది ఆరోగ్యాన్ని ఎనిమిదేండ్ల పాటు పరిశీలించారు.
వీరిలో రోజులో 10.6 గంటల కంటే ఎక్కువసేపు కూర్చున్నవారికి మిగతావారితో పోలిస్తే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇలా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా వాటి ఫలితాలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచలేకపోయాయని అధ్యయనం తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామం అలవాటున్న వారు రోజూ 10.6 గంటలకు పైగా కూర్చొంటే వారికి గుండె వైఫల్యం 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని వెల్లడించింది. వ్యాయామం అలవాటు లేని వారు రోజూ 10.6 గంటలకు పైగా కూర్చొంటే వారిలో హృద్రోగాలు, మరణ ముప్పు ప్రమాదం మరీ ఎక్కువని అధ్యయనం తేల్చింది.