Iraq | బాగ్దాద్, ఆగస్టు 9: బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును 15కు తగ్గించారు. ఇరాక్ ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) పరిశోధకుడు సారా శాన్బార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను దెబ్బ తీస్తుందని తెలిపారు. ఇరాక్‌లో పెద్ద ఎత్తున బాల్య వివాహాలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపణలున్నాయి. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం 20 నుంచి 24 ఏండ్ల మధ్య ఉన్న వారిలో 28 శాతం మందికి 18 ఏండ్లకు ముందే వివాహం అయ్యింది. అలాగే ఏడు శాతం మందికి 15వ ఏడు వచ్చిన వెంటనే పెండ్లి జరిపించారు.