Viral News | మనుషులు ఏం చేసినా చేయకున్నా వయసు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటుంది. బాల్యం, యవ్వనం, మధ్యవయసు, వృద్ధాప్యం ఇలా మానవ జీవిత చక్రంలో వివిధ దశలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలో సమూల మార్పులు కనిపిస్తుంటాయి. చర్మం ముడతలు పడటం, వెంట్రుకలు తెల్లగా మారడం వంటి మార్పులు వస్తాయి. అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ యవ్వనంగా (Stay Young ) కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. వృద్ధాప్య ఛాయలు కనిపించని మెరిసే చర్మం సొంతం చేసుకోవాలని ఎన్నో క్రీములు, ఫేస్ ప్యాక్‌ల వంటివి ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది యోగా, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆహారపు అలవాట్లనూ మార్చుకుంటున్నారు. క్రమం తప్పకుండా కఠిన నియమాలను పాటిస్తూ తమ శరీరం ఎంతో యవ్వనంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమెరికాకు చెందిన ఓ మిలియనీర్ కూడా 40 ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలని ఆరాటపడుతున్నాడు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం వైద్యుల బృందాన్ని నియమించుకుని ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటూ వార్తల్లోకెక్కాడు. కాలిఫోర్నియా (California)కు చెందిన బ్రియాన్ జాన్సన్ (Bryan Johnson) ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో. అతడికి భారీగా ఆస్తులు, డబ్బు ఉంది. ప్రస్తుతం అతడి వయసు 46 ఏళ్లు. అయితే, బ్రియాన్ యువకుడిలా కనిపించాలని కోరుకుంటున్నాడు. తన శరీరంలోని అవయవాలు 18 ఏళ్ల యువకుడిగా పనిచేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నాడు. తన కుమారుడి రక్తాన్ని కూడా తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. ఈ చికిత్స కోసమే ఏటా ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. వృద్ధాప్యం దరిచేరకుండా చికిత్సలో భాగంగా రోజుకు ఏకంగా 111 మాత్రలు వేసుకుంటున్నాడు.
‘ప్రాజెక్ట్ బ్లూప్రింట్’ పేరుతో ఈ ప్రయోగాలు చేస్తున్నాడు. తన ఆరోగ్యాన్ని, అవయవాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రకరకాల వైద్య పరికరాలను కూడా బ్రియాన్ సమకూర్చుకున్నాడు. రాత్రిపూట నిద్రించే ముందు తన శరీరానికి పలు పరికరాలను అమర్చుకుంటాడు. వైద్యుల సూచనలకు అనుగుణంగా తన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నాడు. రాత్రిపూట చేయాల్సిన డిన్నర్ రోజూ ఉదయం 11 గంటలకు తింటాడట. ఇదంతా స్వయంగా బ్రయాన్ జాన్సన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే తన ఎలక్ట్రిక్ ఆడీ కారులో గంటకు 16 మైళ్ల (25 కిలోమీటర్లు) వేగం మించకుండా వెళతానని చెప్తున్నాడు. కాగా, బ్రయాన్ జాన్సన్ నెట్ వర్త్ 400 మిలియన్ డాలర్లు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో ప్రచురించింది.
Also Read..
Ayodhya Ram Temple | శరవేగంగా రామ మందిర నిర్మాణం.. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి
Parineeti-Raghav Chadha | పెళ్లిలో పరిణీతి-రాఘవ్ డ్యాన్స్.. ఫన్నీ వీడియో
Online Shopping | ఫెస్టివ్ సీజన్.. 81 శాతం వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు!