ఇస్లామాబాద్, ఏప్రిల్ 28 : తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఈ సందర్భంగా ఓ విదేశీ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చొరబాటు అనివార్యంగా కనిపిస్తున్న కారణంగా తమ సైనిక బలగాలను బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. భారతదేశం సైనిక దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థానీ సైన్యం ప్రభుత్వానికి తెలియచేసిందని ఆయన చెప్పారు.