Microsoft Outage | మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ‘బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఆఫ్ డెత్’ ప్రభావం దేశవ్యాప్తంగా వివిధ సేవలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా విమానాలు, స్టాక్ మార్కెట్లు, మీడియా సర్వీసులు, పోర్టులపై కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమానాలు రద్దయ్యాయి. అయితే, సమస్యకు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్‌పై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. సంబంధిత అప్డేట్ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. దీనికి డీబగ్‌ను రూపొందించామని.. ప్రస్తుతం సమస్య పరిష్కారమైనట్లు పేర్కొంది.
అయితే, మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు సమాచారం. మరో వైపు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ సైతం స్పందించారు. ‘సింగిల్ కంటెంట్’ అప్డేట్లో బగ్‌తో తలెత్తిన కస్టమర్లతో తమ కంపెనీ సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. మ్యాక్, లైనక్స్ సిస్టమ్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని.. భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదని.. సమస్యను గుర్తించి డీబగ్‌ను ఫిక్స్ చేశామని పేర్కొన్నారు. క్రౌడ్ స్ట్రయిక్ కస్టమర్ల భద్రతకు పూర్తి ప్రాధాన్యమిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.