న్యూయార్క్: మైక్రోసాఫ్ట్(Microsoft) కార్పొరేషన్ సంస్థ ఇద్దరు ఉద్యోగుల్ని తొలగించింది. కంపెనీ 50వ వార్షికోత్సవంలో ఆ ఇద్దరూ నిరసన వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ముస్తాఫా సులేమాన్ ప్రసంగిస్తున్న సమయంలో.. ఇబితల్ అబొసాద్ అనే మహిళ ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నది. ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని తమ కస్టమర్ల జాబితా నుంచి తీసివేయాలని ఆమె మైక్రోసాఫ్ట్ సంస్థను డిమాండ్ చేసింది. ఇక సీఈవో సత్యా నాదెళ్ల, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో.. వనియా అగర్వాల్ అనే మహిళ కూడా తన నిరసన వ్యక్తం చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమాన్ని ఆమె అడ్డుకున్నది.
అయితే ఆ వేదిక వద్దే ఇద్దరు ఉద్యోగుల్ని వెళ్లిపోవాలని ఆదేశించారు. వాషింగ్టన్లోని రెడ్మోండ్లో ఉన్న ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అబొసాద్కు టర్మినేషన్ లేఖను పంపారు. ప్రవర్తన సరిగా లేదని మైక్రోసాఫ్ట్ సంస్థ టర్మినేషన్ లేఖలో పేర్కొన్నది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి రాజీనామా చేయనున్నట్లు అగర్వాల్ పంపిన లేఖను తక్షణమో ఆమోదిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇద్దరు ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ నేరుగా ఎటువంటి ప్రకటన చేయలేదు.