మాస్కో: ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధానికి దిగి ఏడాది కావొస్తున్న తరుణంలో.. రష్యా(Russia)లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా విదేశాంగ శాఖకు చెందిన సీనియర్ దౌత్యవేత్త వాంగ్ యి(Wang Yi) ఇవాళ మాస్కోలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్‌కు మద్దుతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్.. కీవ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇవాళ రష్యాకు మద్దతు పలుకుతూ చైనా దౌత్యవేత్త మాస్కోలో పర్యటించడం విశేషం సంతరించుకున్నది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్(Lavrov) .. చైనా దౌత్యవేత్తను మీట్ అయ్యారు. రెండు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోనున్నట్లు లవ్రోవ్, వాంగ్ యి తెలిపారు.
అమెరికా, యూరోప్ దేశాలు చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని చైనా, రష్యాలు తెలిపాయి. ప్రస్తుతం వాంగ్ యి యూరోప్‌లో టూర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఇవాళ రష్యా విదేశాంగ మంత్రిని కలిశారు. పుతిన్‌తోనూ ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చైనాపై అమెరికా ఆరోపణలు చేస్తోంది. రష్యాకు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని చైనా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు చేసింది.
అయితే రష్యాకు ప్రాణాంతక ఆయుధాలను సరఫరా చేయడం లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. తమ దేశంపై అమెరికా, నాటో దేశాలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.
ఇక పోలాండ్‌లో నాటో నేతల్ని బైడెన్ కలుసుకోనున్నారు. మాస్కోలో భారీ కచేరి నిర్వహించనున్నారు. పుతిన్‌తో పాటు వేలాది మంది ఆ వేడుకల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
పుతిన్ స్పష్టమైన వైఖరితో ఉంటేనే యుద్ధం ముగుస్తుందని, లేదంటే ఆయనకు ఓటమి తప్పదని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తెలిపారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ త్వరలోనే మాస్కోలో పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.