Sri Sri Ravi Shankar | ఐక్య రాజ్య సమితి, డిసెంబర్ 21: కొందరు భావిస్తున్నట్టు ధ్యానం కొందరికి మాత్రమే పరిమితమైన విలాస ప్రక్రియ కాదని, అది ప్రతి ఒక్కరికీ అవసరమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో మతాలు,సరిహద్దులకు అతీతంగా దౌత్య సంబంధాలను పటిష్టపరిచే శక్తివంతమైన ఆయుధమే ధ్యానమని ఆయన ప్రకటించారు.
మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఐరాసలోని భారత శాశ్వత మిషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యానం చేస్తూ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ధ్యానం చేయవచ్చని, అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ధ్యానంపై ఎవరికైనాఅభ్యంతరాలు ఉంటే వాటిని తొలగిస్తుందని చెప్పారు.
ధ్యానం అన్ని మతాలకు, భౌగోళిక సరిహద్దులకు, వయో భేదాలకు అతీతమైనదని, ఇది అందరికీ ఎంతో ఉపయోగకరమైనదని రవిశంకర్ చెప్పారు. ధ్యానం లగ్జరీ కాదు..ప్రస్తుతం అత్యంత అవసరంగా ఆయన అభివర్ణించారు. యూఎన్ జనరల్ అసెబ్లీ 79వ సమావేశం అధ్యక్షుడు ఫిలెమన్ యాంగ్ ప్రసంగిస్తూ ధ్యానం ద్వారా ఆత్మశోధనకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులతో కూడిన భవిష్యత్తు ప్రపంచాన్ని అందచేయడానికి శాంతి మార్గంలో పయనిద్దామని ఆయన పిలుపునిచ్చారు.