కొలరాడో: మెక్‌డోనాల్డ్స్ హ్యాంబర్గర్ల(McDonalds Burgers) ద్వారా.. అమెరికా ఈ.కొలై బ్యాక్టీరియా వ్యాప్తి అవుతున్నది. ఈ నేపథ్యంలో మెక్‌డోనాల్డ్స్ ఫుడ్ కంపెనీ తమ మెనూ నుంచి ఆ హాంబర్గర్లను తీసి వేసింది. ఇటీవల బర్గర్లు తినడం వల్ల ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 49 మంది గాయపడ్డారు. మెక్‌డోనాల్డ్స్ అమ్ముతున్న క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ల ద్వారా ఈ.కొలై బ్యాక్టీరియా వ్యాప్తి అవుతున్నట్లు సీడీసీ గుర్తించింది.
సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు అమెరికాలోని పది రాష్ట్రాల్లో ఆ కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువ శాతం కొలరాడో, నెబ్రస్కా రాష్ట్రాల్లోనే ఈ.కొలై కేసులు ఉన్నాయి. 13 ఏళ్ల నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న వారిలో బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ.కొలై బ్యాక్టీరియాతో కలుషితమైన బర్గర్లు తినడం వల్ల హెమోలైటిక్ యురేమిక్ సిండ్రోమ్ వస్తుందని, దీని వల్ల కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతింటున్నట్లు సీడీసీ వెల్లడించింది.
హ్యాంబర్గర్లలో వాడుతున్న ఉల్లిపాయ ముక్కల వల్లే ఈ.కొలై బ్యాక్టీరియా వ్యాప్తి జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రభావిత రాష్ట్రాల నుంచి క్వార్టర్ పౌండర్ బర్గర్లను మెనూ నుంచి మెక్‌డోనాల్డ్స్ తీసివేసింది. ఉల్లిపాయ ముక్కలను కూడా వాడడం ఆపేసింది.