Belgium | పారిస్, డిసెంబర్ 1: ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు.. అమలుజేయాలని పేర్కొంటూ ఆ దేశం చేసిన చట్టం ఆదివారం(డిసెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.
ఉపాధి పొందే హక్కు సహా సామాజిక, కార్మిక హక్కులను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా బెల్జియం నిలిచింది. ‘సెక్స్ వర్క్’ నేరం కాదని 2022లోనే పేర్కొన్న బెల్జియం, తాజా చట్టంతో ఇతర వృత్తులకు సమానంగా సామాజిక, కార్మిక హక్కుల్ని వారికి కల్పించింది. దీంతో ఇకపై ఏజెన్సీలు(యాజమాన్యాలు) వారికి ఆరోగ్య, జీవిత బీమా, ప్రసూతి సెలవులు, సిక్ హాలిడేస్.. మొదలైనవి అమలుజేయాల్సి ఉంటుంది.
బెల్జియం తీసుకొచ్చిన చట్టంపై హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సెక్క్ వర్క్‌లో ఉండే దోపిడీ, మానవ అక్రమ రవాణా, వేధింపులను ఈ చట్టం అడ్డుకోలేదని కొంతమంది విమర్శకులు హెచ్చరించారు.