బుధవారం 02 డిసెంబర్ 2020
International - Oct 31, 2020 , 01:52:58

టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం

టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం

  • రిక్టర్‌ స్కేలుపై 7.0గా తీవ్రత నమోదు
  • కుప్పకూలిన భారీ భవనాలు
  • రెండు దేశాల్లో 14 మంది మృతి 
  • ఏజియన్‌ సముద్రంలో సునామీ

అంకారా, అక్టోబర్‌ 30: టర్కీ, గ్రీస్‌ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. టర్కీ తీరప్రాంతం, గ్రీస్‌ దీవి సమోస్‌ మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైంది. భూకంప కేంద్రం ఏజియన్‌ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నదని టర్కీ విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. భూకంప ధాటికి టర్కీలోని ఇజ్మిర్‌ రాష్ట్రంలో భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఏజియన్‌ సముద్రంలో సునామీ ఏర్పడటంతో వరద పోటెత్తింది. భవనాలు కూలటంతో టర్కీలో 12 మంది, గ్రీస్‌లో ఇద్దరు మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. భవనాలు కూలుతున్న వీడియోలను, ఇండ్లల్లోకి సముద్రపు నీరు చేరుతున్న చిత్రాలను స్థానికులు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. ధ్వంసమైన భవనాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌సహా అనేక నగరాల్లో భూమి కంపించింది. టర్కీలో భూకంపంతో భవనాలు ఒక్కసారిగా ఊగిపోవటంతో ప్రజలు ప్రాణభయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.