కీవ్: రష్యా దూకుడు పెంచింది. నిన్న రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై విరుచుకుపడింది. రెండు చోట్ల అత్యంత శక్తివంతమైన పేలుళ్లు జరిగాయి. కీవ్‌తో పాటు ఇతర ఉక్రెయిన్ నగరాల్లోనూ నిన్న రాత్రి భీకర దాడులు జరిగాయి. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాలుగు సార్లు భారీ పేలుళ్ల శబ్ధాలు కీవ్‌లో వినిపించాయి. దాడుల సమయంలో ఆకాశం వెలుతురుతో నిండిపోయింది. కొన్ని చోట్ల ఆ సంఘటనలు వీడియోలకు చిక్కాయి. అయితే కీవ్‌లో రష్యా సేనలు దేన్ని టార్గెట్ చేశాయో స్పష్టం కావడం లేదు. ఆ భారీ పేలుళ్లో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారన్న విషయం కూడా ఇంకా తెలియదు. నిన్న కీవ్ సెంట్రల్ రైల్ స్టేషన్ వద్ద భారీ పేలుడు జరిగింది. రష్యా దాడుల నుంచి ఓ షెల్టర్‌లో వందల మంది తలదాచుకుంటున్న ప్రాంతంలో ఆ పేలుడు జరిగింది. రష్యా వదిలిన మిస్సైల్‌ను ఇంటర్సెప్టార్తో అడ్డుకున్నామని, దాని శకలం వచ్చి ఆ ప్రాంతంలో పడినట్లు ఉక్రెయిన్ బలగాలు చెబుతున్నాయి.