Viral News | కేవలం ఐదు నిమిషాల వీడియో కాల్ ఆధారంగా ఓ యువతిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు 9 రోజులకే పశ్చాత్తాపానికి గురయ్యాడు. తాను తప్పు చేశానని.. విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ పెళ్లి కోసం దాదాపు రూ.36 లక్షల వరకు ఖర్చు చేశానని.. వాటిని వధువు నుంచి ఇప్పించాలని కోరాడు. చైనాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.
తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన గు (32) ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి స్థానిక మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించాడు. 200 చైనీస్ యువాన్లు చెల్లించి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ అయ్యాడు. త్వరగా పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో అదే విషయం చెప్పి.. అర్జెంట్‌గా తనకు పెళ్లికి అమ్మాయికి కావాలని కోరాడు. దీంతో సదరు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు గుకి స్థానికంగా ఉండే ముగ్గురు యువతులను పరిచయం చేశారు. కానీ వాళ్లెవరూ నచ్చలేదని చెప్పడంతో.. ఇతర రాష్ట్రాల అమ్మాయిలను చూపించి, రెండు రోజుల్లోనే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు.
అన్నట్లుగానే వాయవ్య చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల యువతిని గుకి పరిచయం చేశారు. ఆమెకు ఎలాంటి అప్పులు లేవని.. నేర చరిత్ర లేదని.. అనారోగ్య, జన్యుపరమైన సమస్యలు ఏవీ లేవని తన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఆమె ప్రొఫైల్ నచ్చడంతో గుకి, సదరు యువతికి మధ్య వీడియో కాల్ ద్వారా పరిచయం చేశారు. వాళ్లిద్దరూ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతి గురించి ప్రశ్నించగా.. తాను సేల్స్ పర్సన్‌గా పనిచేస్తున్నానని చెప్పింది. అయితే ఎక్కువ ప్రశ్నలకు మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందే ఆమె క్రెడిట్ హిస్టరీ, వైద్య పరీక్షల నివేదికలను అందజేస్తామని మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు హామీ ఇచ్చారు.
పెళ్లికి ముందు ఆమె క్రెడిట్ హిస్టరీ, వైద్య పరీక్షల నివేదికలు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే పెళ్లి అర్జెంట్ కావడంతో గు, అతని కుటుంబసభ్యులు యువతిని ప్రత్యక్షంగా చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నారు.
ఈ పెళ్లి కోసం గు ఫ్యామిలీ మొత్తం 2.65 లక్షల చైనీస్ యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.36.95 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో వధువుకు లక్ష యువాన్లు కానుకల రూపంలో ఇవ్వగా.. మ్యారేజ్ బ్యూరోకు 1.6లక్షల చైనీస్ యువాన్లు చెల్లించారు. దీంతో మూడు రోజుల్లోనే మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు వారి పెళ్లి చేశారు. అయితే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే.. గుకి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి జరిగిన తెల్లారి నుంచే ఒక్కొక్కటిగా వధువు గురించి విషయాలు తెలియడం మొదలైంది.
ముందుగా తన భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లి, ఆమె క్రెడిట్ రిపోర్టును పరిశీలించగా దాదాపు లక్ష యువాన్ల అప్పు ఉన్నట్లు తెలిసింది. దీనిపై ప్రశ్నించగా.. అది తన మాజీ ప్రియుడికి సంబంధించినది చెప్పింది. అదే సమయంలో ఆమె మొబైల్ పేమెంట్ యాప్‌లో కనిపించిన పేరు కూడా.. మ్యారేజ్ బ్యూరో చెప్పిన పేరుతో సరిపోలకపోవడంతో గుకి మరింత అనుమానం పెరిగింది. దాని తర్వాత రోజు వధువు మరో షాకిచ్చింది.
తను కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని తెలిపింది. ఎంజైమ్‌ల స్థాయి ఎక్కువగా ఉన్నాయని.. బరువు తగ్గాల్సి ఉందని చెప్పింది. అయితే దీనివల్ల సంతానోత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పెళ్లి జరిగిన తొమ్మిది రోజులకే గు విడాకులు కోరాడు.
ఈ విడాకులకు మొదట యువతి అంగీకరించినప్పటికీ.. తర్వాత మనసు మార్చుకుని గుపైనే రివర్స్ కేసు పెట్టింది. పెళ్లయిన 9 రోజులకే విడాకులు ఇవ్వాలని గొడవ చేయడంతో తాను డిప్రెషన్‌కు గురయ్యానని గుపై కేసు వేసింది. ఇందుకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది. నష్టపరిహారంగా 50 వేల యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7 లక్షలు) చెల్లించాలని దావా వేసింది. అంతేకాకుండా తనను ఎప్పుడూ మేకప్ వేసుకోవాలని, ఇంటి పనులు చేయాలని, ఉద్యోగం వెతుక్కోవాలని గు ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది.
మరోవైపు తమ పెళ్లి జరిపించిన మ్యారేజ్ బ్యూరోపైనా గు కేసు వేశాడు. తనను మోసం చేశారని.. తాను చెల్లించిన 1.6లక్షల చైనీస్ యువాన్లను తిరిగి చెల్లిలంచాలని కోర్టును ఆశ్రయించాడు. అయితే తాము పరిచయం చేసిన అమ్మాయినే అతను పెళ్లి చేసుకున్నాడని డబ్బులు తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేసింది. రీఫండ్ కోసమే కొత్త జంట విడాకుల పేరుతో డ్రామా ఆడుతున్నారని కొత్త వాదన తెచ్చింది. ఇప్పుడు ఈ ఘటన చైనాలో చర్చనీయాంశంగా మారింది.