ఖైరతాబాద్, ఆగస్టు 8: రాష్ట్రంలో నిర్వహించే పోలీస్ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌యాదవ్ డిమాండ్ చేశారు. పోలీస్ నియామకాల్లో జిల్లా పోస్టుల కేటాయింపు, శారీరక ప్రమాణాల విషయంలోనూ అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోలీసు అభ్యర్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని 36 ఏండ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏండ్లకు పెంచాలని కోరారు. 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 31 ద్వారా కానిస్టేబుల్‌కు 34 ఏండ్లు, ఎస్సైకి 37 ఏండ్ల వరకు వయోసడలింపు కల్పించినప్పటికీ, ఆ గడువులో నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వేలాది మంది అభ్యర్థులకు అవకాశం దక్కలేదని పేర్కొన్నారు. నిరుద్యోగుల సంఘం ప్రతినిధి అశోక్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, యాదాద్రి జిల్లాలకు తగిన పోలీస్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లాల్లో పెరుగుతున్న జనాభా, నేరాలు, డ్రగ్స్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అదనపు పోస్టులు అవసరమని తెలిపారు. పోలీస్ నియామకాల్లో లాంగ్ జంప్ ప్రమాణాన్ని 4 మీటర్ల నుంచి 3.6 మీటర్లకు తగ్గించాలని కోరారు. ఆర్మీ నియామకాల్లో 3.6 మీటర్ల ప్రమాణం ఉన్నప్పుడు పోలీస్ నియామకాల్లో 4 మీటర్లు ఎందుకని ప్రశ్నించారు. కనీసం 3.8 మీటర్లకైనా తగ్గించాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థులు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పలుమార్లు కలిసి సమస్యను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వయోపరిమితి, జిల్లా పోస్టులు, శారీరక ప్రమాణాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిరుద్యోగ అభ్యర్థులు రవీంద్రనాయక్, గీత, క్రాంతి, ప్రతాప్, రంజిత్ కుమార్, కిరణ్ కుమార్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.