ఖాట్మండు, డిసెంబర్ 25: నేపాల్ పాలనా పగ్గాలు మళ్లీ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ చేతికి వచ్చాయి. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతు తెలుపడంతో దేశ కొత్త ప్రధానిగా ఆయన్ను అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆదివారం నియమించారు. నేపాల్‌కు మూడోసారి ప్రధానిగా ప్రచండ సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. రొటేషనల్ పద్ధతిలో ప్రధాని పదవి చేపట్టేందుకు ప్రచండ, ఓలీ మధ్య ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా తొలుత ప్రచండకు అవకాశం వచ్చిందని తెలిపాయి. కాగా, దేశ రాజకీయాల్లో ఆదివారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి.
ఓలీ నేతృత్వంలోని ప్రతిపక్ష సీపీఎన్-యూఎంఎల్తో పాటు పలు పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి. అంతకుముందు ప్రచండను ప్రధానిగా చేసేందుకు అధికార నేపాలీ కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో.. ప్రచండ అధికార కూటమితో తెగదెంపులు చేసుకొన్నారు. 275 మంది సభ్యులు ఉండే నేపాల్ ప్రతినిధుల సభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ(138 సీట్లు) రాలేదు. అధిక స్థానాలు గెలుచుకొన్న నేపాలీ కాంగ్రెస్ (89 సీట్లు) గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే కూటమికి 165 మంది మద్దతు ఉన్నది.