న్యూఢిల్లీ : ఐరోపా ఖండంలోని ఓ చిన్న దేశం మాల్టా.. ప్రజలు డ్రైవింగ్ చేయడం ఆపేస్తే డబ్బులు ఇస్తానంటూ ముందుకొచ్చింది. రోడ్లపై ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజలను ప్రభుత్వ రవాణా వైపు ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్టు చెప్తున్నది. ఈ పథకం కింద పౌరులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ఐదేండ్లపాటు ఎటువంటి వాహనాన్ని డ్రైవింగ్ చేయకూడదు.
అప్పుడు ఆ వ్యక్తి సుమారు రూ.26 లక్షల వరకు బహుమతిగా అందుకుంటాడు. అయితే ఈ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. ఏటా రూ.5.5 లక్షల చొప్పున ఐదేండ్ల పాటు అందజేస్తారు. ఒకవేళ మధ్యలో గనుక మీరు డ్రైవింగ్ చేస్తే.. అప్పటివరకు అందుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలి. ఈ పోటీలో పాల్గొనేవారు 30 ఏండ్లు లేదా అంతకన్నా తక్కువ వయసున్న వారై ఉండాలి. వాళ్లు కనీసం ఏడేండ్లు మాల్టాలో నివసించి ఉండాలి. డ్రైవింగ్‌కు సంబంధించి వారిపై ఎటువంటి కేసులు ఉండకూడదు. పోటీలో పాల్గొనే అవకాశం ఏడాదికి వెయ్యి మందికి మాత్రమే లభిస్తుంది.