న్యూఢిల్లీ: మాలి రక్షణ మంత్రి సడియో కమరా ఆ దేశ రాజధాని సమీపంలో శనివారం హత్యకు గురయ్యారు. దేశ వ్యాప్తంగా సైనిక స్థావరాలపై అల్ ఖైదా అనుబంధ తుయరెగ్ రెబెల్స్ చేసిన దాడుల వల్ల ఆయన మరణించినట్టు అల్ జజీరా చానల్ పేర్కొన్నది. మాలిలో ప్రభావవంతమైన వ్యక్తుల్లో సడియో ఒకరని అల్జజీరా తెలిపింది.
కటి పట్టణంలోని తన నివాసంలో ఆత్మాహుతి కారు బాంబు దాడిలో సడియో హత్యకు గురయ్యారని వెల్లడించింది. ఆయన ఇంటి వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ దాడి జరిగిందని తెలిపింది. కటిలో పరిస్థితి తమ నియంత్రణలో ఉందని ఆర్మీ చెప్తున్నప్పటికీ సాయుధ గ్రూపులు ఆదివారం కూడా కాల్పులకు తెగబడినట్టు వార్తలు వచ్చాయి. సడియో మృతి ఆ దేశ సైన్యానికి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు తెలిపారు.