Malasia : మలేషియా దేశ చరిత్రలో కొత్త శకం ఆరంభం కానుంది. ఈసారి ఆ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. మలేషియాలో నవంబర్ 19వ తేదిన 15వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. దాంతో, మొదటిసారిగా ఆ దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వచ్చింది. దాదాపు 60 ఏళ్లు మలేషియాను పరిపాలించిన ఇస్మాయిల్ సబ్రి యాకోబ్ నాయకత్వంలోని అధికార బరిసల్ నేసియోనల్ కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కూటమి 30 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం నేతృత్వంలోని పకతన్ హరపన్ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పకతన్ హరపన్ కూటమి 220 సీట్లకు పోటీచేసి, 82 స్థానాల్లో విజయం సాధించింది. మాజీ ప్రధాని ముహైద్దిన్ యాసిన్ నాయకత్వంలోని పెరికతన్ నేసియోనల్ పార్టీ 73 సీట్లతో రెండో స్థానంలో ఉంది. దాంతో, మలేషియాలో పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనేది ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకుడు మహథిర్ మొహమద్ ఓడిపోయారు. ఆయన తన 53 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం ఇదే తొలిసారి.