పారిస్: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం లూవ్రాను ఇటీవల దోచుకున్న దొంగలు 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ.526 కోట్లు) విలువైన రీజెంట్ డైమండ్‌ను వదిలేశారు. ఈ వజ్రం గోల్కొండ గనుల్లో దొరికినదే. ఇది నీలం-ఆకుపచ్చ రంగులో ఉండే కుషన్ కట్ వజ్రం. దీని బరువు 140.6 క్యారట్లు.
ఈ వజ్రాన్ని గోల్కొండ గనుల్లో 1698లో వెలికి తీశారు. అప్పట్లో దీని బరువు 426 క్యారట్లు. దీనిని గుర్తించిన వ్యక్తి తన శరీరంలో కోత పెట్టుకుని, దాచిపెట్టి, అక్రమంగా దేశం నుంచి తరలిపోవాలని అనుకున్నాడు. ఓ నౌక కెప్టెన్‌ను సహాయం కోరాడు. దీనిని అమ్మగా వచ్చిన లాభంలో సగం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఆ వజ్రం గురించి అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్ పిట్ దృష్టికి వెళ్లింది. 1704-1706 మధ్య కాలంలో ఇంగ్లండ్‌లో దీనిని కట్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన రీజెంట్ ఫిలిప్ డీఆర్లీన్స్కు 1717లో చేరింది. ఆ సమయంలో పాశ్చాత్య దేశాల్లో అత్యంత అందమైన వజ్రంగా పేరు పొందింది. నాణ్యత, కట్ విషయంలో అత్యుత్తమమైనవాటిలో ఒకదానిగా కొనసాగుతున్నది. 1719 నాటికి దాని కొనుగోలు విలువ మూడు రెట్లకు పెరిగింది.
లూయిస్ 15 ఈ వజ్రాన్ని 1721లో ఓ రిసెప్షన్లో ధరించాడు. 1722లో తన పట్టాభిషేకం సమయంలో తాత్కాలికంగా తన కిరీటంలో ధరించాడు. 1725 నుంచి తన పాలన ముగిసిన 1774 వరకు తన హ్యాట్లో ధరించేవాడు. లూయిస్ 16 తన కిరీటంలో 1775లో ధరించాడు. ఆ తర్వాత దానిని తన హ్యాట్పైన పెట్టుకునేవాడు. ఈ వజ్రం 1792లో దొంగతనానికి గురై, 1793లో దొరికింది. దీనిని డైరెక్టరీ, కాన్సులేట్ చాలాసార్లు కుదువపెట్టాయి. దీనిని నెపోలియన్ బోనపార్టీ 1801లో రికవరీ చేశాడు. ఎంపరర్ నెపోలియన్ 1 కత్తిలో ఆభరణంగా 1812లో చేరింది.ఆ తర్వాత లూయిస్ 18, చార్లెస్ 10, నెపోలియన్ 3 ఎంప్రెస్ యూజినీల కిరీటాల్లో తళుకులీనింది.
పారిస్ ప్రాసిక్యూటర్ లౌరే బెకావు మాట్లాడుతూ, దొంగలు రీజెంట్ డైమండ్‌ను ఎందుకు పట్టుకెళ్లలేదు? అనేది అంతుబట్టని విషయమని చెప్పారు. దీనికి చాలా కారణాలను చాలా మంది చెప్తున్నారు. వాటిలో ఒకటి ఏమిటంటే, గోల్కొండ గనుల నుంచి దీనిని స్మగ్లింగ్ చేయాలనుకున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనిని ధరించిన ఫ్రెంచ్ రాయల్స్, ఎంపరర్స్ దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొన్నారు. కింగ్ లూయిస్ 16, మేరీ ఆంటోయినెట్టెలను ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఉరితీశారు. నెపోలియన్ బోనపార్టీ ఫ్రాన్స్ నుంచి సుదూరంగా ఉన్న సెయింట్ హెలీనా దీవికి పారిపోయాడు.