సుమత్ర: సెనార్ తుఫాన్‌తో ఇండోనేషియా(Indonesia) అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. భారీ వరదలు పెను నష్టాన్ని కలిగించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. థాయ్‌ల్యాండ్, మలేషియాలో కూడా విధ్వంసం జరిగింది. థాయ్‌లో సుమారు 170 మంది మరణించారు. సైనార్ తుఫాన్‌తో దెబ్బతిన్న ఇండోనేషియాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. సుమత్ర దీవుల్లో నష్టం భారీగా ఉన్నది. వేలాది మందికి ఆహారం అందడం లేదు. కొన్ని చోట్ల వరదల వల్ల బిల్డింగ్, ఇండ్లు కొట్టుకుపోయాయి. ఫిలిప్పీన్స్, శ్రీలంకతో పాటు దక్షిణాసియా దేశాల్లో వచ్చిన తుఫాన్ల వల్ల ఈ నెలలోనే 900 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
కేవలం నార్త్ సుమత్ర దీవుల్లో వరదల వల్ల సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది గల్లంతు అయ్యారు. డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ కూడా అందడం లేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం కోసం అలమటిస్తున్నారు. సైనార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవ్ సుబియాంటో పర్యటిస్తున్నారు.
ఆహారం, నీళ్ల కోసం లూటీ జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం సహాయనిధి అందుతోందని, దీంతో లూటీలు ఆగిపోయినట్లు చెబుతున్నారు.