Covid Long time Effect | కరోనా సోకినా.. లక్షణాల్లేవని అలసత్వం ప్రదర్శించొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కోవిడ్ నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోకపోతే అది దీర్ఘకాలంగా ఉండటంతోపాటు అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ మానవ శరీరంలోని ప్రతిభాగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది. దీర్ఘ కాలిక కరోనా ప్రభావం ప్రాణాలకే ముప్పని యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పరిశోధన చెబుతున్నది. చూపుతోంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ తదితర అవయవాలపై మహమ్మారి దాడి చేస్తుందని, ప్రాణాంతక వ్యాధుల భారీన పడేస్తుందని హెచ్చరిస్తున్నది.
మన శరీరంలో అత్యంత కీలకమైన బహుళ ఫంక్షనల్ నాడీ వ్యవస్థ ‘వాగస్’పై దీర్ఘకాల కొవిడ్ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధన సారాంశం. మెదడు మొదలు నడుము వరకు విస్తరించి ఉండే వాగస్ నాడీ వ్యవస్థ.. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ పనితీరును నియంత్రిస్తుంది. దీర్ఘకాల కరోనా వల్ల నరాలు గట్టిపడి పోయి ఆహారం మింగడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకాలు, రాత్రి చెమటలు పట్టడం, జీర్ణక్రియ సరిగా లేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి.
కోవిడ్ కొద్దిరోజులే ఉన్నా గుండె పనితీరుపై అధిక ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఏడాది పాటు గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 65 ఏండ్లలోపు వారితోపాటు ఊబకాయం, మధుమేహం తదితర ఆరోగ్య రుగ్మతలు లేని వారికీ ఈ ముప్పు ఎక్కువైందని వెల్లడైంది. యువతతోపాటు స్మోకింగ్ చేయనివారికీ ఈ సమస్యలు తలెత్తినట్లు తేలింది. గతేడాది కరోనా సోకి, కోలుకున్న వారిలో 20 శాతం మంది గుండె సంబంధ వ్యాధితో బాధపడ్డారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే మహమ్మారి సోకిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 52 శాతం అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది.