వాషింగ్టన్, నవంబర్ 11: కరోనా మనల్ని వీడినా..ఆ మహమ్మారి లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒత్తిడి, మానసిక ఆందోళనతో లాంగ్ కొవిడ్ లక్షణాలు తీవ్రతరం అవుతున్నాయి. డిప్రెషన్, అలసట, నిద్రలేమి, ఇతర మానసిక సమస్యలు వయోజనుల్లో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రియమైన వ్యక్తి మరణం, ఆర్థిక లేదా ఆహార అభద్రత, కొత్తగా అభివృద్ధి చెందిన వైకల్యం లాంటివి ఇందుకు కారకాలుగా పరిశోధకులు గుర్తించారు. 2020 మార్చి 10 నుంచి మే 20 2020 వరకు న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్‌లో చేరిన 790 మంది కొవిడ్ రోగులను ఆరు నెలలు, ఏడాది తర్వాత పరిశోధకులు సర్వే చేశారు. ఇందులో 51శాతం మంది తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.