బ్రిస్బేన్, సెప్టెంబర్ 9: శరీరంలోని ఏదైనా భాగం పూర్తిగా పాడైతే దాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ రోజుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వందల సంవత్సరాల కింద ఏమీ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు జరిగేవా.. అసలు ఈ సర్జరీలు మొదట ఎప్పుడు జరిగాయో తెలుసా?
ఇదే విషయాన్ని తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. దీంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవయవాల తొలగింపు శస్త్రచికిత్స 31 వేల ఏండ్ల కిందటే జరిగిందని వారు గుర్తించారు. బోర్నియో దీవుల్లో ఓ చిన్న పిల్లాడి అస్తిపంజరాన్ని పరిశీలించగా, ఎడమ కాలు కింది భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా 31 వేల ఏండ్ల కిందటే తొలగించారని కనుగొన్నారు.