బీరట్: ఎలక్ట్రానిక్ వస్తువులతో లెబనీస్పై జరుగుతున్న దాడి(Lebanon Explosions) .. ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రెండు రోజుల్లో జరిగిన ఎలక్ట్రానిక్ వస్తువుల పేలుళ్లు.. పెను అనుమానాలకు దారి తీస్తున్నది. మంగళవారం పేజర్లు, బుధవారం వాకీటాకీలు పేలిన ఘటనలో.. 32 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. అయితే నిగూఢంగా సాగుతున్న ఎలక్ట్రానిక్ వార్తో లెబనీస్ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎంత వరకు సురక్షితమో తెలియకుండాపోతుందని అంటున్నారు. ఏ క్షణమైనా ఫోన్లు పేలుతాయేమో అన్న టెన్షన్లో అక్కడి ప్రజలు ఉన్నారు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పేలుతున్న తీరు అంతుచిక్కని అటాక్‌గా మిగిలిపోయింది.
బుధవారం వాకీటాకీలు పేలిన సమయంలో.. రాజధాని బీరట్‌లో ఆకాశం పొగతో కమ్ముకున్నది. ఒక్క బీరట్లోనే వందల సంఖ్యలో వాకీటాకీలు పేలినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీరట్‌లోని రాఫిక్ హరిరి విమానాశ్రయంలో వాకీటాకీలను, పేజర్లను బ్యాన్ చేశారు. ప్రయాణికులు ఎవరూ వాటిని పట్టుకెళ్లరాదు అని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అవి కనిపిస్తే, వాటిని స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటన చేశారు.
ఎలక్ట్రానిక్ అటాక్ జరుగుతున్న తీరుతో బీరట్ వీధులన్నీ రక్తంమయంగా మారుతున్నాయి. చేతులు, నడులు, కంటి గాయాలతో యువకులు రోడ్ల మీద కనిపిస్తున్నట్లు ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. ఒకరి పక్కన ఒకరు నడిచేందుకు జంకుతున్నారని ఒకరు ఆరోపించారు. పరిస్థితి చాలా భయానకంగా ఉందని స్థానికులు అంటున్నారు. గందరగోళం మధ్య చాలా మంది తమ ప్రయాణాలను ఆపేశారు. గాజా వార్ వల్ల ఇప్పటికే లెబనాన్‌పై తీవ్ర ప్రభావం పడింది. తాజా దాడులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ వస్తువులతో పేలుళ్లకు పాల్పడడం క్రిమినల్ చర్య అవుతుందని ప్రముఖ అంతర్జాతీయ యుద్ద న్యాయవాదులు చెబుతున్నారు. పేజర్లు,వాకీటాకీలతో పేలుళ్లకు పాల్పడం నేరమే అని వార్క్రైం లాయర్ సర్ జెఫర్రీ నైస్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో దాడి చేయడం అక్రమమే అవుతుందన్నారు. ఇది పౌరులను టార్గెట్ చేయడమే అవుతుందన్నారు. ఇజ్రాయిల్‌లోని జనజీవన ప్రదేశాల్లోకి హమాస్ మిస్సైళ్లు వదిలిన ఘటనతో పోల్చవచ్చు అని తెలిపారు.
మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య బోర్డర్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడు హిజ్బుల్లా క్షేత్రాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది. పేజర్లు, వాకీటాకీల అటాక్‌తో తమకు సంబంధం లేదని ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ మోసాద్ తెలిపింది.