Israel | లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పతున్నది. దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం మరోసారి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో 51 మంది మరణించగా.. 223 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. గత రెండు రోజుల్లో దాదాపు 150 మంది మహిళలు, పిల్లలతో సహా 564 మంది దుర్మరణం చెందారు. 1800 మందికిపైగా గాయపడ్డారు. 2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య నెల రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుపడుతున్నది. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో దక్షిణ లెబనాన్‌లో జనం తలదాచుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు.
దాదాపు 90వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇవాళ లెబనాన్ నుంచి టెల్ అవీవ్ వైపుగా ప్రయోగించిన మిస్సైల్‌ను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హిజ్బుల్లా తొలిసారిగా ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. అయితే, హిజ్బుల్లా ప్రయోగించిన మిస్సైల్‌ని ఐరన్ డోమ్ నింగిలోనే పేల్చేసింది. బీర్లో మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో సీనియర్ హిజ్బుల్లా కమాండ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య అనధికారిక యుద్ధం సాగుతున్నది. మరో వైపు ఇవాళ రాత్రి యూఎన్ భద్రతా మండలి సమావేశం కానున్నట్లు సమాచారం. ఓ కార్యక్రమంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇరుపక్షాల దౌత్యపరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు.