లండన్, నవంబర్ 25: విదేశాలకు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావటంతో హఠాత్తుగా భారత్‌ను వీడి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని లలిత్ మోదీ అన్నారు. భారత్‌కు తాను ఎప్పుడైనా తిరిగి రావొచ్చునని చెప్పారు. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న లలిత్ మోదీ ఇటీవలి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘వాస్తవానికి భారత్‌లో నాపై లీగల్ కేసులేవీ లేవు. వీటి కారణంగా భారత్‌ను వీడలేదు. 2010లో దావుద్ ఇబ్రహీం నుంచి ప్రాణ హాని ఉండటం వల్లే దేశాన్ని వీడాను. కారణం.. అతడు క్రికెట్ మ్యాచ్‌లను ఫిక్స్ చేయాలనుకున్నాడు. నా ప్రాణానికి ముప్పు తెచ్చే ప్రయత్నాలు చేశాడు. నా పేరు హిట్ లిస్ట్‌లో ఉందని, రక్షణ కల్పించలేమని సీనియర్ పోలీసులు సైతం చెప్పారు’ అని అన్నారు.