మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 16:15:52

ల‌డాఖ్‌ను యూటీగా గుర్తించం: చైనా

ల‌డాఖ్‌ను యూటీగా గుర్తించం:  చైనా

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని ల‌డాఖ్ ప్రాంతాన్ని గ‌త ఏడాది కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  మోదీ స‌ర్కార్ చేసిన ఆ విభ‌జ‌న‌పై డ్రాగ‌న్ దేశం చైనా త‌న కామెంట్ చేసింది.  ల‌డాఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించ‌మ‌ని చైనా వెల్ల‌డించింది.  అక్ర‌మ రీతిలో భార‌త ప్ర‌భుత్వం ల‌డాఖ్‌ను యూటీగా చేసిన‌ట్లు చైనా ఆరోపించింది.  ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని నెల‌ల నుంచి ఆ ప్రాంతంలో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  జూన్ 15వ తేదీన వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ జ‌వాన్లు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.  ఎల్ఏసీ వెంట సుమారు 60 వేల మంది సైనికుల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు కూడా ఇటీవ‌ల అమెరికా మంత్రి పాంపియో వెల్ల‌డించారు.  ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు ఇటీవ‌ల రెండు దేశాల‌కు చెందిన సైనిక‌, దౌత్య అధికారులు చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హించారు. కానీ ఇంకా స‌మ‌స్య కొలిక్కిరాలేదు.  అయితే తాజాగా ల‌డాఖ్‌ను యూటీగా గుర్తించ‌మ‌ని చైనా ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. 

సోమ‌వారం ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో 44 బ్రిడ్జ్‌ల‌ను ఓపెన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జావో లిజియ‌న్ మాట్లాడారు. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు స‌రిహ‌ద్దు మౌళిక‌వ‌స‌తుల అభివృద్ధే కార‌ణ‌మ‌ని అన్నారు.  ఏ దేశం కూడా ఎటువంటి దాడికి పాల్ప‌డ‌కుడ‌ద‌ని, ఉద్రిక్త‌త‌ల‌ను మ‌ళ్లీ రెట్టింపు చేసే విధంగా చ‌ర్య‌లు ఉండ‌కూడ‌ద‌న్నారు.  స‌రిహ‌ద్దుల్లో బ్రిడ్జ్‌ల‌ను ఓపెన్ చేసిన అంశంపై స్పంద‌న కోర‌గా.. ల‌డాఖ్‌ను అక్ర‌మ ప‌ద్ధ‌తిలో యూటీగా చేశార‌ని ఆయ‌న అన్నారు. స‌రిహ‌ద్దు వెంట సైనిక ద‌ళాల‌ను పెంచే రీతిలో మౌళిక‌వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు జావో తెలిపారు.  


logo