వేలాది వసంతాల చరిత్ర కలిగిన భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలో ఎంతో ప్రత్యేకత ఉంది. దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా భారత సంస్కృతిని ప్రేమించే వాళ్లు కోకొల్లలు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘మై లవ్ ఫ్రం కొరియా’ అనే ఇన్స్టాగ్రాం హ్యాండిల్లో ఈ వీడియో షేర్ చేశారు.
దీనిలో ఒక కొరియన్ యువతి చక్కనైన భారతీయ చీరకట్టులో ఒడిస్సీ నాట్యమాడుతూ కనిపిస్తుంది. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన యువతి పేరు బీనా కూమ్. కొరియాకు చెందిన ఈ యువతి 2001 నుంచి ఒడిస్సీ నృత్యం నేర్చుకుంటోంది. అప్పట్లో ప్రముఖ కళాకారిణి మీరా నాయర్ వేసిన కామసూత్ర కళారూపకం చూసిన తర్వాతనే బీనాకు ఒడిస్సీపై మక్కువ ఏర్పడిందట.
అప్పటి నుంచి ఈ నృత్యం నేర్చుకుంటూ.. వివిధ ప్రదేశాల్లో ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ‘ఒక కొరియన్ ఇలాంటి దుస్తులు వేసుకొని, ఇంత అందమైన డ్యాన్స్ చేయడం ఇప్పటి వరకూ చూడలేదు’ అని కామెంట్స్ చేస్తున్నారు. బీనా డ్యాన్స్ చూస్తే గూస్బంప్స్ వస్తున్నాయని మరికొందరు అంటున్నారు.