హైదరాబాద్: కిన్జాల్ హైపర్సోనిక్ మిస్సైల్‌ను ఇవాళ రష్యా ప్రయోగించింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆయుధ డిపోను ఆ క్షిపణితో టార్గెట్ చేసింది. రష్యా అమ్ములపొదిలో ఉన్న అత్యంత అధునాతన వెపన్ ఇది. కిన్జాల్ అంటే రష్యన్ భాషలో ఖడ్గం. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన రష్యా తొలిసారి ఈ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఎటువంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నా.. ఈ కిన్జాల్ క్షిపణి టార్గెట్ దిశగా కచ్చితత్వంతో దూసుకువెళ్తుంది. దీని వేగం మాక్ 10. అంటే ధన్వి వేగం కన్నా.. పది రెట్ల వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. ఫ్లయిట్ రూట్ మొత్తం అదే స్పీడ్‌తో ఈ మిస్సైల్ వెళ్తుంది.
MiG-31K సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ విమానాలు ఈ కిన్జాల్ క్షిపణులను మోసుకువెళ్తాయి. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నాటో దళాలు ఫాక్స్హోండ్ అని పిలుస్తాయి. చాలా వరకు హైపర్సోనిక్ వ్యవస్థల్లో ఉండే హార్డ్‌వేర్ దీంట్లోనూ ఉంటుంది. వీటిల్లో అదనంగా అవన్గార్డ్ గ్లైడర్ కూడా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లైడర్స్.. ఐసీబీఎంల్లో ఉంటాయి. జిర్కాన్ మిస్సైళ్లకు కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇవానో ఫ్రాంకివిస్క్ నగరంలో ఉన్న అండర్‌గ్రౌండ్ ఆయుధ డిపోను ఇవాళ రష్యా సైన్యం కిన్జాల్ మిస్సైల్‌తో పేల్చేసింది.