Kim @ New year | ప్రపంచమంతా బాణాసంచా కాల్చి నయా సాల్ జోష్ పొందగా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ మాత్రం విభిన్నంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోగా.. కిమ్ సామ్రాజ్యంలో మాత్రం తెల్లవారు 2.50 గంటలకు నిప్పులు విరజిమ్ముతూ క్షిపణి గాలిలోకి దూసుకెళ్లింది.
కొత్త సంవత్సరం రోజున బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. ఉత్తర కొరియా ఉత్తర రాజధాని ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొరియా-జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడిపోయే ముందు ఈ క్షిపణి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా గుర్తించింది. కిమ్ క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ముమ్మాటికీ ప్రపంచ శాంతి, భద్రతకు విఘాతం కలిగించే ప్రక్రియ అని పేర్కొన్నది. అమెరికా సాయంతో ఉత్తర కొరియా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టిన ఉత్తర కొరియా.. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆయుధ పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. అణ్వస్త్రాల తయారీని కూడా భారీగా పెంచుతామని, పవర్ఫుల్ ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని కిమ్ ప్రకటించారు. శనివారం మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా.. గత ఏడాది 70 కి పైగా క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.