న్యూఢిల్లీ: లెబనాన్‌లో హిజ్బొల్లాను టార్గెట్ చేస్తూ ఇటీవల పేజర్ పేలుళ్లు(Pager Blasts) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ పేలుళ్లలో 12 మంది మృతిచెందారు. వేల మంది గాయపడ్డారు. అయితే ఆ పేలుళ్లకు ఓ భారతీయ వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోష్ అనే వ్యక్తి.. హిజ్బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 37 ఏళ్ల రిన్సన్కు బల్గేరియాలో ఓ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ నుంచి పేజర్లు.. మిలిటెంట్ హిజ్బొల్లాకు సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఆ పేజర్లనే ఇజ్రాయిల్‌కు చెందిన మోసాద్ నిఘా ఏజెన్సీ మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో మూడు గ్రాముల పేలుడు పదార్ధాలను జోడించినట్లు కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ వాస్తవానికి ఏఆర్-924 మోడల్ పేజర్లను బల్గేరియాలోని బీఏసీ కాన్సల్టింగ్ కేఎఫ్టీ కంపెనీ ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. హంగేరిలోని బుదాపెస్ట్‌లో ఆ కంపెనీ ఉన్నది. అయితే కేరళ వ్యక్తి రిన్సన్కు మాత్రం నార్వేలో పౌరసత్వం ఉన్నది.
బల్గేరియా భద్రతా సంస్థ డీఏఎన్ఎస్.. పేజర్ల పేలుళ్ల గురించి ఆరా తీస్తున్నది. దేశ హోంశాఖ కూడా ఆ కంపెనీ పాత్రను విశ్లేషిస్తున్నది. నోర్టా గ్లోబల్ లిమిటెడ్ పేరుతో కంపెనీ నడుస్తున్నట్లు తేలింది. 2022లో సోఫియాలో దాన్ని రిజిస్టర్ చేశారు. నార్వేకు చెందిన రిన్సన్ జోష్ ఆ కంపెనీని స్థాపించారు. లెబనాన్‌లో పేలిన పేజర్లు.. బల్గేరియాలో ఉత్పత్తి కాలేదని, వాటిని దిగుమతి చేయలేదని, ఎగుమతి కూడా చేయలేదని డీఏఎన్ఎస్ తెలిపింది. సెప్టెంబర్ 17న జరిగిన పేలుళ్లకు, తమకు ఎటువంటి లింకు లేదని బల్గేరియా తెలిపింది.
నార్వే రాజధాని ఓస్లాలో పోలీసులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. వయనాడ్‌కు చెందిన జోస్..ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం నార్వే వెళ్లాడు. ఓస్లా వెళ్లడానికి ముందు అతను కొన్నాళ్లు లండన్‌లో పనిచేశాడు. నార్వే ప్రెస్ గ్రూప్ డీఎన్ మీడియాలో అతను అయిదేళ్ల పాటు డిజిటల్ కస్టమర్ సపోర్ట్‌లో పనిచేసినట్లు లింక్డిన్ పేజీ ద్వారా తెలిసింది. కంపెనీ పని నిమిత్తం అతను విదేశాల్లో ఉన్నాడని, అతన్ని చేరుకోలేకపోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
భార్యతో కలిసి ఓస్లోలో రిన్సన్ ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. అతని సోదరుడు లండన్‌లో ఉన్నాడు. ఫోన్లో అతను రోజూ మాట్లాడుతుంటాని, గడిచిన మూడు రోజుల నుంచి అతను కాంటాక్టులో లేడని, ముక్కు సూటి వ్యక్తి అని, అతన్ని పూర్తిగా నమ్ముతున్నామని, తప్పుడు పని చేయడని, బహుశా ఆ పేలుళ్లలో అతన్ని ట్రాప్ చేసి ఉంటారని ఓ బంధువు అనుమానం వ్యక్తం చేశారు.