Kenya protests : పన్నుల పెంపునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు కెన్యా రాజధాని నైరోబీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్లతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో 200 మంది గాయపడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి హక్కుల సంఘాలు వెల్లడించాయి.
అంతేగాక 105 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా ఐదు హక్కుల గ్రూపులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. మరోవైపు పోలీసు వాహనం ఢీకొని ఆరుగురు, రబ్బర్ బుల్లెట్లు తగిలి ఐదుగురు మరణించారు. నైరోబిలోని బ్లిస్ మెడికల్ సెంటర్లో బుల్లెట్ గాయంతో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మరణించారు.
ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా పౌరుల అరెస్టులను మానుకోవాలంటూ పోలీస్ అధికారులను అభ్యర్థిస్తున్నామని కెన్యా మెడికల్ అసోసియేషన్, లా సొసైటీ ఆఫ్ కెన్యా, డిఫెండర్స్ సంఘం, ఇండిపెండెంట్ మెడికల్ లీగల్ యూనిట్ పేర్కొన్నాయి. కెన్యాలోని 47 కౌంటీల్లోని 19 కౌంటీల్లో 2.7 బిలియన్ డాలర్ల అదనపు పన్నులను పెంచాలని మంగళవారం ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది.
ఈ పన్ను పెంపును వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు గురువారం తీవ్రమయ్యాయి. కొత్త పన్నులతో జాతీయ వైద్య బీమా పథకం ఆదాయంపై 2.75 శాతం లెవీ ఉంటుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. అలాగే కూరగాయలు, నూనె, ఇంధనంపై పన్నులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, ఇది జీవనవ్యయ ప్రమాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.