ఆల్మటి: కజకిస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని ఎటువంటి వార్నింగ్ లేకుండానే చంపేయాలంటూ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ తొకయేవ్ ఆ దేశ బలగాలను ఆదేశించారు. ఇంధన ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కజకిస్తాన్‌లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ఆ నిరసనల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు అధ్యక్షుడు ఆరోపించారు. బుధవారం ఆల్మటి నగరంలో జరిగిన కాల్పుల్లో 26 మంది ఆందోళనకారులు, 15 మంది పోలీసులు మృతిచెందారు. చనిపోయిన ఆందోళనకారులు సాయుధ నేరస్తులని ప్రభుత్వం చెబుతోంది. హింసాత్మక నిరసనల్లో మరో మూడు వేల మందిని అరెస్టు చేశారు. ఆల్మటి నగరంలో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, కానీ ఉగ్రవాదులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, అందుకే విధ్వంసక నిరసనకారుల్ని చంపేయాలంటూ పోలీసులకు, ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు అధ్యక్షుడు తెలిపారు.