Kamala Harris | వాషింగ్టన్, నవంబర్ 7: అమెరికాలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరిస్తామని అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పేర్కొన్నారు. ఆమె హోవర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలను ఆమోదించాలని ఆమె కోరారు. తన మనసు సంతోషంతో నిండి ఉన్నదని అన్నారు. తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతతో ఉంటానని, దేశ ఆదర్శాలను రక్షించేందుకు పోరాడతానని పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడానని, శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్లో ఆయన ఎలక్షన్ నైట్ పార్టీ ఇచ్చారు. ట్రంప్ కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఫోటోను ట్రంప్ మనవరాలు కై ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో పలువురు భారత సంతతి అమెరికన్లకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. వివేక్ రామస్వామికి ట్రంప్ కార్యవర్గంలో కీలక స్థానం దక్కవచ్చు. ఇక, అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతిగా భారతీయ మూలాలు ఉన్న కశ్యప్ పటేల్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నది. భారత సంతతి వ్యక్తి బాబీ జిందాల్‌కు ట్రంప్ కార్యవర్గంలో హెల్త్ ఆండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీగా చోటు దక్కే అవకాశం ఉంది. నిక్కీ హేలీకి సైతం ట్రంప్ కార్యవర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకునేందుకు అమెరికాకు ఇది అవకాశమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో తమకు ఒరిగేదేమీ లేదని, అధ్యక్షులు మారినంత మాత్రాన విధానాలు మారవని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికార ప్రతినిధి ఫతేమే మొహజెరానీ పేర్కొన్నారు.