బీజింగ్: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై జోకేసిన(PLA Joke) ఓ కామిడీ కంపెనీకి భారీ జరిమానా విధించింది చైనా సర్కార్. షాంఘై జియాగూ కల్చర్ మీడియా కంపెనీకి 2 మిలియన్ల డాలర్ల ఫైన్ విధించింది. చైనాకు చెందిన సాంస్కృతిక శాఖ ఆ జరిమానా వేసింది. జోకులతో సమాజాన్ని హాని చేయడం సరికాదు అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రఖ్యాత నటుడు లీ హషి ఓ లైవ్ షోలో ఆ జోకేశారు. అయితే ప్రభుత్వం సీరియస్ కావడంతో కామిడీ కంపెనీ ఆ నటుడిని తొలగించింది.
మే 13వ తేదీన బీజింగ్‌లో జరిగిన ఓ లైవ్ ఈవెంట్లో లీ హషి ప్రేక్షకులను నవ్వించేందుకు జోక్ చేశారు. ఆ జోక్‌కు చెందిన వీడియో ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పరువు తీసే రీతిలో ఆయన జోకేశారు. పెంచుకుంటున్న రెండు కుక్కులు ఓ ఉడుత వెంట పడుతున్నాయని డైలాగ్ కొట్టాడు. 2013లో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వదిలిన ఫేమస్ స్లోగన్స్‌ను ఆధారంగా చేసుకుని ఆ నటుడు కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
చైనా ప్రభుత్వాన్ని కావాలని నిర్వీర్యం చేసే ఎటువంటి ప్రయత్నాన్ని అయినా అడ్డుకుంటామని, ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆ దేశ సాంస్కృతిక శాఖ తెలిపింది. బీజింగ్‌లో ఇక నుంచి జియాగూ కల్చర్ మీడియాకు చెందిన షోలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మేనేజ్మెంట్లో ఉన్న లోపాల వల్ల ఆ తప్పు జరిగినట్లు జియాగూ కంపెనీ తెలిపింది.