వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆయన స్వల్ప దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్ తెలిపారు. బైడెన్ ప్రస్తుతం డెలావేర్ సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారని, అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
కాగా, ఈ రోజు మధ్యాహ్నం నేను కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా శ్రేయస్సు కోరుకునేవారందరికీ ధన్యవాదాలు. నేను కోలుకునేవరకు అందరికీ దూరంగా ఉంటాను. ఈ సమయంలోనూ అమెరికా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను.’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
I tested positive for COVID-19 this afternoon, but I am feeling good and thank everyone for the well wishes.
I will be isolating as I recover, and during this time I will continue to work to get the job done for the American people.
— President Biden (@POTUS) July 17, 2024
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్ వెగాస్‌లో జరిగిన ఒక సదస్సులో బైడెన్ పాల్గొన్నారు. ప్రసంగానికి ముందుకు కరోనా టెస్టు చేయడంతో అందులో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. తను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు జీన్ పియర్ మీడియాకు వెల్లడించారు. ఆయనకు పాక్స్లోవిడ్ యాంటీ వైరస్ డ్రగ్ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే ఎన్నికల బరిలో ప్రత్యర్థి ట్రంప్ కంటే వెనుకబడిపోయిన బైడెన్.. ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంతో ప్రజలకు మరింత దూరం కానున్నారు.