TTD | పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు టీటీడీని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సోమవారం నాడు టీటీడీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై టీటీడీని హైకోర్టు పలు ప్రశ్నలు అడిగింది.
లెక్కింపునకు లుంగీలతో వచ్చే బదులుగా.. ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు ప్రస్తావించలేదని టీటీడీని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కానుకల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటు వివరాలు లేవని అడిగింది. పరకామణిలో భక్తులు సమర్పించిన కానుకలు పక్కదారి పట్టడం సహించలేమని తేల్చిచెప్పింది. టీటీడీ పరకామణి చోరీ కేసులో నిందితులతో అప్పటి పోలీసుల పాత్ర ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో సంబందం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆదాయానికి మంచిన ఆస్తులు ఉంటే పరిశీలించాలని చెప్పింి.
అలాగే భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఏవైనా ఆదేశాలిస్తే అమలు చేస్తామని ఈ సందర్భంగా టీటీడీ తెలిపింది. అయితే సలహాలు, సూచనలు తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.