వాషిగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) పదవీకాలం మరికొన్ని గంట్లో ముగియనుంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన సోమవారం రాత్రి 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..
తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపారు. 2020లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచే బైడెన్ గెలుపొందారు. అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం వైట్‌హౌస్‌కు చేరింది. పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన అక్కడికి చేరుకున్నారు. వీడ్కోలు ప్రసంగం కూడా అక్కడే చేయనున్నారు. భార్య జిల్ బైడెన్‌తో కలిసి రాయల్ మిషనరీ బాప్టిస్ట్ చర్చిని సందర్శించి మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ గురించి మాట్లాడనున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తారు. గతంలో తన విజయానికి కారణమైన వారికి అక్కడి నుంచి ధన్యవాదాలు తెలుపనున్నారు.
ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం!
మరోవైపు అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో సోమవారం ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.