ఆదివారం 28 ఫిబ్రవరి 2021
International - Jan 20, 2021 , 01:25:21

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం నేడే

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం నేడే

  • ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయనున్న కమలాహ్యారిస్‌
  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన అమెరికా ‘క్యాపిటల్‌' 
  • భద్రతాదళాలు అప్రమత్తం.. అడుగడుగునా తనిఖీలు
  • అధ్యక్షుడి ప్రమాణం రిహార్సల్‌ కార్యక్రమం పూర్తి
  • కాలిఫోర్నియా సెనేటర్‌ పదవికి కమల రాజీనామా
  • 150 ఏండ్ల సంప్రదాయానికి ట్రంప్‌ తూట్లు

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశానికి కొత్త అధినేత వచ్చే శుభ ఘడియలు దగ్గరపడుతున్న వేళ.. అమెరికా అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుధవారం ప్రమాణం చేయనున్నారు. 1971లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. అధ్యక్షుడు కావాలన్న ఐదు దశాబ్దాల తన కలను నేడు సాకారం చేసుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో) జరుగనున్న బైడెన్‌ ప్రమాణానికి రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రెండువారాల క్రితం అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు చేసిన దాడులు పునరావృతంకాకుండా పాతిక వేల మంది నేషనల్‌ గార్డు బలగాలు డేగ కండ్లతో నిఘాను మరింత పటిష్ఠం చేశాయి. క్యాపిటల్‌ హిల్‌ భవనం వైపునకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.


ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించి రిహార్సల్స్‌లో భాగంగా క్యాపిటల్‌ భవనాన్ని అధికారులు సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాణం జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటనలు జరిగితే యంత్రాంగం ఎలా స్పందించాలన్న అంశంపై ఈ రిహార్సల్స్‌ నిర్వహించారు. మరోవైపు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్షుడి ప్రమాణానికి వెయ్యి మంది అతిథులనే అనుమతించబోతున్నట్టు సంబంధిత కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో చట్టసభ సభ్యులు, వారి బంధువులు ఉన్నట్టు పేర్కొంది. ఇంకోవైపు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా బుధవారం బాధ్యతలు చేపట్టబోతున్న భారత సంతతి మహిళ కమలాహ్యారిస్‌ కాలిఫోర్నియా సెనేట్‌ పదవికి సోమవారం రాజీనామా చేశారు.  


ప్రమాణానికి రాను.. రాకపోవడమే మంచిది!

కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం ఆనవాయితీ. అయితే బైడెన్‌కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో తెలిపారు. ఈ విధంగా 150 ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ఆయన తూట్లు పొడిచారు. తన ప్రమాణానికి ట్రంప్‌ హాజరుకాకపోవడమే మంచిదని బైడెన్‌ కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. కాగా 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ తన తర్వాత అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న ఎస్‌ గ్రాంట్‌ ప్రమాణానికి హాజరుకాలేదు. 

ఆఖరి రోజు ట్రంప్‌ ఇలా..


అధ్యక్షుడిగా బుధవారం ఆఖరి రోజును గడుపనున్న ట్రంప్‌నకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికి అమెరికన్‌ మిలిటరీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య రెడ్‌ కార్పెట్‌పై ట్రంప్‌ దంపతులకు ఊరేగింపు జరుగనున్నది. ట్రంప్‌నకు మిలిటరీ దళాలు ‘21 గన్‌ సెల్యూట్‌' చేయనున్నాయి. అధ్యక్షుడు ప్రయాణించే ప్రత్యేక హెలికాప్టర్‌ ‘మెరైన్‌ వన్‌'లో ట్రంప్‌ చివరిసారిగా ప్రయాణించనున్నారు. 

హామీలను  నెరవేర్చగలరా?

ఎన్నికల ప్రచారంలో అమెరికన్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించి, అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న జో బైడెన్‌కు హామీల అమలు కత్తిమీద సామువంటిదేనని నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, నిరుద్యోగిత రేటును తగ్గించడం, కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఒక్కొక్క అమెరికన్‌కు 1,400 డాలర్లు (రూ. 1.02 లక్షలు) చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేయడానికి 1.9 ట్రిలియన్ల డాలర్లతో ఉద్దీపన ప్యాకేజీకి చట్టసభల్లో ఆమోదం ముద్ర వేయించడం, ముస్లిం దేశాలపై విధించిన వీసా నిబంధనలు తొలిగించడం వంటి హామీలను బైడెన్‌ అమలు చేయడం అంత సులభం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ‘అధికారాన్ని చేపట్టిన తొలి వంద రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు కరోనా టీకా’ హామీ మాత్రం నెరవేరవచ్చని తెలిపారు. 

VIDEOS

logo