జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్యే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను తొలిసారి కలిసిన విషయం తెలుసు కదా. ఈ అగ్ర దేశాల అధ్యక్షుడు జెనీవాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌కు బైడెన్ ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. తన ఏవియేటర్ స్టైల్లో ఉన్న అమెరికన్ మేడ్ సన్‌గ్లాసెస్‌ను పుతిన్‌కు బహుమతిగా ఇవ్వడం విశేషం. ఇది చూసి ఈ సన్‌గ్లాసెస్‌ను తయారు చేసిన రాండాల్ఫ్ ఇంజినీరింగ్ హెడ్ పీటర్ వాస్కీవిక్ స్పందించారు. తన కంపెనీ సన్‌గ్లాసెస్ ఇలా దౌత్యపరమైన సూచికగా నిలవడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.
ఇది జరిగిన వెంటనే తన ఫోన్లు రింగ్ అవుతూనే ఉన్నాయని, సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ మొదలైందని ఆయన తెలిపారు. తనకు చాలా సంతోషం కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి అవకాశం ఎప్పుడోగానీ రాదు అని పీటర్ చెప్పారు. ఇలాంటి సన్‌గ్లాసెస్ సాధారణంగా మిలిటరీ వాళ్లు ధరిస్తారు. అమెరికా సాయుధ బలగాలు వీటి కోసమే ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
1978 నుంచి ప్రతి నెలా 25 వేల సన్‌గ్లాసెస్‌ను అమెరికా సాయుధ బలగాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. 1980ల్లో వచ్చిన టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్‌తో ఈ ఏవియేటర్ స్టైల్ సన్‌గ్లాసెస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు పుతిన్‌కు ఇచ్చిన సన్‌గ్లాసెస్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. వీటిని తయారు చేయడానికి ఆరు వారాల సమయం పట్టింది. తయారీలో మొత్తం 200 దశలు ఉండటం విశేషం.