వాషింగ్టన్: టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. తాజాగా తన రియాల్టీ ల్యాబ్స్ విభాగం నుంచి 1500 మంది ఉద్యోగులను తొలగించడానికి యూఎస్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సిద్ధమవుతున్నది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత, డాటా సెంటర్ ప్రాజెక్టులపై కంపెనీ దృష్టి పెట్టిన క్రమంలో ఈ తొలగింపులు చేపట్టనున్నది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రియాల్టీ ల్యాబ్‌లో 15 వేల మంది పనిచేస్తుండగా, అందులో 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపాలని సంస్థ నిర్ణయించింది. రియాల్టీ ల్యాబ్స్ ఉద్యోగులందరితో మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బుధవారం సమావేశం కానున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.