Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ (Lauren Sanchez)ను ఈ వారంలో వివాహం చేసుకోబోతున్నారు. కొలరాడోలోని ఆస్పెన్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 28న వీరి వివాహం జరగనున్నట్లు తెలిసింది. బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియో వంటి దాదాపు 180 మంది ప్రముఖులు పాల్గొనే ఈ వేడుక కోసం ఓ విలాసవంతమైన రెస్టరెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం ఈ పెళ్లి కోసం ఏకంగా 600 మిలియన్ డాలర్లు అంటే రూ.5,000 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లికి అన్ని కోట్లా..? అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఖర్చు వార్తలపై బెజోస్ తాజాగా స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలే అని తేల్చి చెప్పారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘పెళ్లికి 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలన్నీ అసత్యాలే. ఇలాంటిదేమీ జరగట్లేదు. వాటిని ఎవరూ నమ్మొద్దు. చదివేదవన్నీ నిజం కాదని అనేందుకు ఇదో మంచి ఉదాహరణ. నిజం గడపదాటకముందే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని నమ్మేయకూడదు’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక ఈ వార్తలపై లారెన్ శాంచెజ్ కూడా స్పందించింది. మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
Furthermore, this whole thing is completely false — none of this is happening. The old adage “don’t believe everything you read” is even more true today than it ever has been. Now lies can get ALL the way around the world before the truth can get its pants on. So be careful out… https://t.co/wz2SWp6wBZ
— Jeff Bezos (@JeffBezos) December 22, 2024
మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 54 ఏళ్ల శాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ (MacKenzie Scott)తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో గతేడాది వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా బెజోన్ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్ డాలర్ల విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అమెరికా ఫ్లోరిడా (Florida)లోని ‘ఇండియన్ క్రీక్’ (Indian Creek) ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
Sriram Krishnan | ట్రప్ ఏఐ పాలసీ సలహాదారుగా భారతీయ అమెరికన్
బెజోస్ పెళ్లికి రూ.5 వేల కోట్ల ఖర్చు!
Dostarlimab | క్యాన్సర్‌కు దివ్యౌషధం.. త్వరలోనే అందుబాటులోకి!