Dostarlimab | వాషింగ్టన్ : నూటికి నూరు శాతం విజయవంతమైన క్యాన్సర్ ఔషధం డోస్టర్లిమాబ్ (బ్రాండ్ పేరు జెంపెర్లి) త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి రాబోతున్నది. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) బ్రేక్‌త్రూ థెరపీ డిజిగ్నేషన్ హోదాను ఇచ్చింది. జూన్‌లో జరిగిన క్లినికల్ పరీక్షల్లో ఈ ఔషధం చక్కని ఫలితాలను చూపింది.
‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ఈ వివరాలను ప్రచురించారు. ఈ మందు శస్త్ర చికిత్స, రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ వంటివాటి అవసరం లేకుండానే రెక్టల్ క్యాన్సర్ ట్యూమర్స్‌ను పూర్తిగా నిర్మూలించింది. సమర్థవంతమైన ఇమ్యునోథెరపీ వల్ల రెక్టల్ క్యాన్సర్ రోగుల జీవితాలు మారుతాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవడం వంటి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. తీవ్రమైన వ్యాధులకు చికిత్స చేసే నూతన ఔషధాలకు బ్రేక్‌త్రూ థెరపీ డిజిగ్నేషన్‌ను ఇస్తారు. దీనితో సరిపోల్చదగిన ఇతర చికిత్సా విధానాలేవీ లేనపుడు ఈ హోదాను ఇస్తారు. ఇకపై డోస్టర్లిమాబ్ ఔషధాన్ని మరిన్ని పరీక్షలు చేస్తారు. అత్యంత వేగంగా సమీక్షిస్తారు. ఎఫ్‌డీఏ సహాయంతో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ దశలో ఇది విజయవంతమైతే, నాన్ బ్రేక్‌త్రూ డ్రగ్స్ కన్నా మూడేళ్ల ముందుగానే ఇది అందుబాటులోకి వస్తుంది.